Christmas Parable - 4

 బలహీనులను ఏర్పరచుకొనుట




           ఆ కుర్రాడు పుట్టుకతోనే బహు బలహీనముగా జన్మించాడు. చిన్న వాడిగా ఉన్నప్పుడు తరచూ అనారోగ్యానికి పాలవుతూ వుండేవాడు ఆ పిల్లోడు. అందరి వలె ఆడుకుంటూ పాడుకుంటూ ఉండుటకు ఆ పిల్లవాడి శరీరము సహకరించేది కాదు. యవ్వన ప్రాయంలోకి అడుగు పెట్టినప్పటికీ శారీరకముగా చాలా బలహీనముగా ఉండేవాడు. శారీరకముగా శక్తి లేని వాడై ఉన్నప్పటికీ సేవ చేయాలనే ఆశ, ఆశక్తి తనను ముందుకు నడిపేది కాని, అతని శరీరం దానికి ససేమిరా అనేది. ప్రతి ఆదివారమున మందిరమునకు వెళ్లి వచ్చే వాడు కానీ అక్కడ గీతాలు అతనిని ఏమాత్రం కదిలించేవి కాదు. ఆ పాటలలోని భావం అర్ధమయ్యేది కాదు. ఆ పాటలలో ఉజ్జీవమే కరువయ్యేది. ఆ పాటలు విన్నప్పుడల్లా చాలా బాధ పడేవాడు.

   ఒక రోజు ఉండబట్టలేక తన తండ్రితో...

నాన్న! మన సంఘములో పాడే పాటలు చాలా బోర్ గా ఉంటున్నాయి, పాదుకుందామన్నా ఆ పదాలు నాకు అస్సలు అర్ధం కావడం లేదు అని అంటూ బాధపడుతూ తన తండ్రితో చెపాడట. ఆ తండ్రి, నాయనా! చర్చిలో పాటలు నీకు అర్ధం కాకపోతే, అవి పాత తరమునకు చెందినవి అని నువ్వు తలస్తే ఎందుకని క్రొత్త తరానికి అవసరమయ్యే క్రొత్త పాటలను అందరికీ అర్ధమయ్యే భాషలో నువ్వే ఎందుకు రచింపకూడదు? అని తన కొడుకును ప్రోత్సాహిస్తూ సవాలును చేసాడు. ఆ పిల్లవాడు తన నాన్న సవాలును చాలా ఆనందముగా స్వీకరించి ప్రార్ధనాపూర్వకముగా నేటి తరములో ఉన్న ప్రతి ఒక్కరికి అర్ధమయ్యే విధముగా చక్కని పాటలు రచించాడు. అలా ఆ కుర్రాడు స్వయంపరచిన పాటలు అతి తక్కువ సమయంలోనే ప్రపంచములో పలుచోట్ల పాడుకొనే రీతిలో ప్రాచూర్యము పొందాయి, ఈ క్రిస్మస్ కాలములో మనము అందరము పాడుకొనే “హాయి లోకమా.." అనే గీతం కుర్రాడి మండుతున్న మనసులో నుండి వచ్చినదే. Joy to the world... ఇలా దాదాపు 750 పాటలు స్వయపరిచాడు. అతడే నవతరంలో పేరుపొందిన ప్రపంచ గొప్ప కీర్తనాకారుడైన ఐజక్ వాట్స్.

        ప్రియ సహోదరుడా! ఐజక్ వాట్స్ బహు బలహీనుడైనప్పటికీ, అందరిలా చురుకైనవాడు కాకపోయినప్పటికీ, బయటి పనులు అందరిలా చేయలేకపోయినప్పటికీ దేవుని కొరకు ఏదైనా చేయవలెననే తపన అతణ్ణి దేవుని హస్తాల్లో పడే విధముగా చేసింది. కనికరముగల దేవుడు ఇంటి బయట సేవ చేయుటకు చేతకాని బలహీణ్ణి ఇంటి లోపలే కూర్చోబెట్టి ప్రపంచమంతటా ఎంతో సంతోషముతో పాడుకోగలిగిన కీర్తనలు రాయించినాడు. దేవునికి కావలసింది నీ శక్తియుక్తులు కాదు కానీ ఆయన కోసం జీవించాలని తపించే హృదయం. వారి సంఘములో పాడే కీర్తనలు అర్ధం కావడం లేదని, ఎటువంటి ఉజ్జీవము పుట్టించుట లేదని దిగులు చెందిన ఐజాక్ వాట్స్ తండ్రి మాటవిని తన చుట్టూ ఉన్న చీకటిని దివ్యమైన కీర్తన ద్వారా వెలుగుమయంగా మార్చెను.

           ప్రియ చదువరీ! మీ సంఘము, సంఘములో వాక్య పరిచర్య అందున్న కీర్తనలు, విశ్వాసులు మీరు ఆశిస్తున్న ఆత్మీయ స్థాయిలో లేవా? ఎటుచూసినా నిర్జీవం, చీకటిమయంగా ఉన్నదా? దిగులు చెందకు. ఆ సంఘ అభివృద్ధికి ఎంత ప్రయాస పడగలవో అంత ప్రయాసపడు. ఆ సంఘ కాపరిని ఎంత బలపరచగలవో అంత బలపరచు. నీ చుట్టూ పరిశుద్ధులుగా నటిస్తూ, క్రీస్తును అవమానపరిచే వారుంటే నువ్వు క్రీస్తుకోసం రోషం కలిగి క్రైస్తవుడు ఎలా జీవించాలో నీ జీవితం ద్వారా చూపించు.

             ప్రియ సహోదరుడా! నువ్వు శారీరకంగా బలహీనముగా ఉన్నావా? అంగ వైకల్యమా? ఆర్థికంగా బహు హీన స్థితిలో వున్నావా? సేవ చేయుటకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదా? ఎటువంటి తలాంతులు లేవని చింతిస్తున్నావా? చింతించవద్దు. దేవునికి కావలసింది నీ తలాంతులు కాదు, నీ శక్తియుక్తులు కాదు. దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలు, శిష్యులు అంతా గొప్ప విద్యావేత్తలు, బహు శక్తివంతులేమీ కాదు, తాము బలహీనులైనప్పటికీ బలవంతుడైన దేవుని హస్తాల్లో పడి గొప్ప కార్యాలు చేశారు.కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించుకొంటే నిన్ను కూడా బలమైన సాధనంగా వాడుకొనుటకు యేసయ్య సమర్ధుడు. మరి ఎందుకు నేడే నీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించకూడదూ!

"బలవంతులను సిగ్గుపరచుటకు దేవుడు బలహీనులను ఏర్పరచుకొనెను.”

(1కొరింథీ 1:29)


Also Read: Christmas Parable 1 - నిరు పేదను చేరిన ప్రేమ