Christmas Parable - 1

 నిరు పేదను చేరిన ప్రేమ


     పూర్వమందు పర్షియా దేశమును తెలివి, జ్ఞానము, మంచితనము కలిగిన ఒకరాజు పరిపాలించుచూ, తన దేశ ప్రజలను ఎంతగానో ప్రేమించుచుండెను. తన రాజ్యములోని ప్రజలకు కావలసిన బాగోగులు ఎంతో శ్రద్ధతో తెలుసుకోవడమేగాక తానే తన ప్రజలు ఏవిధంగా జీవిస్తున్నారోనని కూలివానిగా, బిక్షగానిగా మారువేషము వేసుకొని తన ప్రజల యొక్క కష్టములను స్వయంగా చూస్తూ పేదవారి ఇళ్ళను దర్శించేవాడు. అయితే ఆయన రాజని ఆ రాజ్య ప్రజలుమాత్రం గుర్తించకుండా జాగ్రత్త పడుతూ ఉండేవాడు.

            ఇలా ఉండగా ఓ రోజు మారువేషంలో సంచరిస్తున్న రాజుకు ఎంతో దీనస్థితిలో వుండి కూలిపని చేసుకుంటున్న ఒక వ్యక్తి కనబడెను. వెంటనే ఆ రాజు అతని యొద్దకు వచ్చి ఒంటరితనంతో కృంగిపోతూ వున్న అతనికి మంచి మాటలతో ఓదార్పు నివ్వడమేగాక ఆ బీదవానికి తోడుగా వుండి, అతను తినే ఆహారమును భుజించి, అతనితోపాటు నేలమీదే పరుండి కొన్ని రోజులు అతనితో గడిపి వెళ్ళిపోయెను. కొంత కాలమైన తర్వాత రాజు మరలా ఆ పేదవానిని దర్శించెను. తన అసలు స్వరూపాన్ని బయటపెట్టగా ఆ బీదవాడు అతనిని గుర్తుపట్టి వణుకుతుండగా రాజు చిరునవ్వుతో 'నీకేది కావాలో అది కోరుకో' అనెను. అందుకా బీద ముసలివాడు “రాజా! నీవు నీ సింహాసనమును, మహిమను విడిచి పెట్టి చీకటిలో మగ్గుతున్న ఈ నిరుపేదను దర్శించి, నాతోపాటు గంజి త్రాగావు, నేలమీదే పడుకున్నావు, నా కష్టాన్ని పంచుకున్నావు. నాకెంతో ఆదరణ ఇచ్చావు. ఎన్నో విలువైన బహుమతులు ఇతరులకు ఇచ్చావేమోకానీ, నాకుమాత్రం నిన్నునీవే బహుమతిగా ఇచ్చుకున్నావ్ ఇంతకన్నా గొప్పభాగ్యం ఇంకేముంటుందని” చెప్పి కన్నీళ్ళతో ఆ రాజు చేతుల్లో ఒదిగెనట.


         ప్రియ స్నేహితుడా! యేసుక్రీస్తు రాజులరాజై యుండి, దేవుడై యుండి దాసుని స్వరూపము దాల్చి మనం పడియున్న చోటికి వచ్చి (లూకా 10:33) తన్నుతాను నీకు బహుమతిగా ఇచ్చుకొనెను. మరి ఆ యేసుకు నీవేమిచ్చావ్?


Also Read: Christmas Parable 2 - దేవుడే రిక్తుడైన వేళ