Christmas Parable - 2

 దేవుడే రిక్తుడైన వేళ


          1873వ సం||లో హవాయి ద్వీపములోగలకుష్టు రోగులమధ్య సేవ చేయుటకు క్రీస్తును గూర్చి, క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించుటకు 'జోసెఫ్ డామియిన్' అనే సేవకుడు అక్కడికి వెళ్ళెను. ఆ ద్వీపమునకు చేరిన వెంటనే అక్కడున్న కుష్టు రోగులను ప్రేమతో, ఆప్యాయంగా పలకరించి వారితో స్నేహంగా, సన్నిహితముగా ఉంటూ తద్వారా క్రీస్తు చూపిన ప్రేమను ఆ ద్వీపము వారికి పంచాలని ఎంతో ప్రయత్నించెను. ఓ చక్కని సంఘమును కట్టెను. అందులో దివారాత్రములు ఆ కుష్టురోగులకొరకు ప్రార్ధనలు చేసాడు. క్రీస్తు ప్రేమను ఎంతగా ప్రకటించగలడో ఎన్ని రీతులుగా చూపించగలడో అన్ని విధాలుగా చూపించాడు గాని, అక్కడ ఉన్న కుష్టురోగులు అతను చెప్పిన మాటలను వినలేదు. ఆ కుష్టు రోగులైన వారు అతనిని చేర్చుకొనలేదు. అతని ప్రయత్నాలు, ప్రయాస, చేసిన సేవంతా నిష్ప్రయోజనముగానే తోచింది. అలా 12 సంవత్సరములు ఆ కుష్టురోగుల మధ్య బహుగా ప్రయాస పడినను ప్రతిఫలము దొరకక ఎంతో నిరాశ చెంది ఆ ప్రాంతాన్ని విడచి తిరిగి తన స్వదేశమైన బెల్జియం దేశానికి పోవుటకై ఓడ ఎక్కెను.

          ఎంతో ప్రయాస పడినప్పటికీ తన సేవ ఫలభరితం కాలేదని దుఃఖంతో, వేదనతో ప్రయాణం చేస్తూ, ఈ చేతులతో ఎంతో కష్టపడ్డాను. మందిరమును ఈ చేతులతోనే కట్టాను. ప్రతి ఇంటితలుపు తట్టాను అని అనుకుంటూ తన చేతులను చూచుకొనుచుండగా అతని చేతి వ్రేళ్ళలో తెల్లని మచ్చలు కనిపించెను. కుష్టు రోగము తనకు అంటుకొనెను. తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. తన ప్రేమను కుష్టురోగులు పొందలేకపోయినను వారి కుష్టురోగము తాను పొందుకొనెను. సువార్తీకునిగా అంగీకరించని ఆ ప్రజలు కనీసం కుష్టురోగిగానైనా నన్ను అంగీకరించి, తమలో ఒకనిగా భావిస్తారేమో అనే ఆశతో వెంటనే తిరగు ప్రయాణమై అదే ద్వీపములో అడుగు పెట్టెను. ఆ యొక్క దైవజనుడు కుష్టురోగిగా తమలోని ఒక వ్యక్తిగా తిరిగి వచ్చాడన్న వార్త ఆ యొక్క ద్వీపమంతా కొన్ని గంటల్లోనే తెలిసిపోయింది. ఆ ద్వీపము యొక్క వాసులందరు అతనిని చూడవచ్చి, ఆశ్చర్యకరముగా అతని చుట్టూ చేరి తమలో ఒకనిగా బహు సంతోషముతో అంగీకరించిరి. గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి ఏమనగా, మరుసటి ఆదివారం తాను నిర్మించిన ఆ మందిరము ఆ కుష్టు రోగులతో క్రిక్కిరిసి పోయెను. స్థలం చాలక బయటనే చాలామంది నిలబడిపోయిరి. అతితక్కువ కాలంలోనే ఆ సేవకుడి బోధను సువార్తను, సువార్తకు ఆధారమైన క్రీస్తును ఆ ద్వీప వాసులు అంగీకరించి దేవుని బిడ్డలుగా తమ్మునుతాము అప్పగించుకొనిరి. 12 సం||లలో సాధ్యం కానిది. కొన్ని నెలల్లో ఎలా సాధ్యమయ్యెను? అందుకు కారణం, అతడు వారిలో ఒక కుష్టురోగిగా కనబడుటయే.

          ప్రియ సహోదరుడా, సహోదరీ! ఇదే జరిగింది. రెండువేలసం||లక్రితం యేసయ్య పరలోకం నుండి మన మధ్యకు దేవదేవుడిగాను, మహా చక్రవర్తిగాను లేక గొప్ప రాజుగానో వస్తే ఆయనను మనం అంగీకరించమని, అర్ధం చేసుకోలేమని ఎరిగిన దేవుడు ముందుగానే తన అనంత ప్రణాళిక చొప్పున ఎన్నికలేనివానిగాను దరిద్రుడిగాను శ్రమనొందిన వానిగాను తృణీకరింపబడినవానిగాను మనమధ్య సంచరించెను. కారణం: ఫిలిప్పీ 2:6, 7 చదవండి. మరి నీకోసం తన్నుతాను తగ్గించుకొని నీ కొరకే సిలువపై శాపకరమైన మరణాన్ని సహించుటకు తద్వారా నిన్ను పాపం నుండి నరక బంధకములనుండి విడిపించుటకు ఈ లోకంలో రెండువేలసం||లక్రితం జన్మించి నీ స్థానములో మరణించిన ఆ యేసయ్యను ఎందుకు అంగీకరించకూడదూ? ఆ హవాయి ద్వీపములో ఉన్న కుష్టు రోగులు ఆ సేవకున్ని తమలో ఒకడిగా కుష్టురోగిగా అంగీకరించి ఏరీతిగా క్రీస్తు ప్రేమను తెలుసుకొన్నారో అదే రీతిగా నీకోసం పాపిగా మార్చబడి నీ పాపాన్ని శాపాన్ని భరించి నిన్ను విడిపించుటకు ఈ లోకంలో ఉదయించిన ఆ ప్రేమా స్వరూపియైన ఆ త్యాగమూర్తిని కనీసం ఈ క్రిస్మసనందైన సొంత రక్షకునిగా అంగీకరించి నీ గుండె గుడిలో ఆయనకు స్థానమిచ్చి రక్షకునిగా ఎందుకు అంగీకరించకూడదూ? ఒక్కసారి ఆలోచించు!


"దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ

కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము

పొందునట్లు ఆయనను అనుగ్రహించెను." (యోహా 3:16)