Christmas Parable - 3
ఎంతైనా తండ్రి ప్రేమ కదా
ఒకానొక దేశమందు ఆ దేశపు రాజు మరియు మంత్రి ఎంతో అన్యోన్యంగా వుండేవారు. అనేకసార్లు మంత్రి రాజు గారితో దేవుని ప్రేమను గురించి ఆయన చేసిన త్యాగమును గురించి, మానవాళిని రక్షించుటకు ఆయనే సాక్షాత్తు మానవునిగా దీనునిగా పశువులశాలలో జన్మించుట గురించి చెబుతూ వుండేవాడు. కాని ఆ రాజుకు మాత్రం దేవుని గురించి మాట్లడటం అసలు ఇష్టముండేది కాదు. ఓ రోజు కోపంగా మంత్రితో... మీ దేవుడు మానవాళిని రక్షించాలనుకుంటే ఆయనే ఎందుకని పరలోకంలో నుండి దిగి రావాలా? దూతలనో, ప్రవక్తలనో, అవతార పురుషులనో, పంపించవచ్చు గదా? ఆయనే వచ్చి రక్షించాలా? అని విడ్డూరంగా అడిగెను. దానికి మంత్రిగారు ఏమీ మాట్లాడలేదు.
ఓ సాయంత్రం రాజుగారు, మంత్రి కలసి అందమైన కొలనులో పడవలో వెళ్లుచూ వుండెను. చుట్టూ సైన్యము రాజును వెంబడించుచూ ఉండిరి. రాజు మాట్లాడుతూ తన కనుదృష్టి గట్టు ఒడ్డున ఆడుకొంటున్న యువరాజు మీద పడెను. ఆశ్చర్యంతో... అలా చూస్తుండగా కాలుజారి బాలుడైన ఆ రాకుమారుడు ఆ కొలనులో పడిపోయెను. ఇంకేముంది రాజుగారు మరోమాట లేకుండా అమాంతంగా కొలనులోకి వురికి తన కుమారుని రక్షించుకొని కుమారుడ్ని ఇంటికి తీసుకొని వెళ్ళెను.
రాజా! మీ ప్రక్కన నమ్మకమైన మంత్రిని నేను వున్నాను, మనచుట్టూ ఎంతోమంది సైనికులూ వున్నారు. ఒక్కమాట సెలవిస్తే మేము వెళ్లి రక్షించేవారము కదా? మీరే ఎందుకు రక్షించాలి? అని ప్రశ్నించెను. వెంటనే రాజు తడుముకోకుండా “ఎంతైనా తండ్రి ప్రేమ కదయ్యా” అది నన్ను బలవంతము చేసింది. అందుకే ప్రాణాలను తెగించి నా కమారుడ్ని రక్షించుకొన్నాను. రాజా! 2000 సం||రాల క్రితందేవుణ్ణి బలవంతము చేసింది ఈ తండ్రి ప్రేమే. కాబట్టే ఆయన ఎవర్నీ పంపక తానే తన బిడ్డలమైన మనలను రక్షించుకొనుటకు ఈ లోకానికి వచ్చెనని చెప్పగా రాజు సత్యమును గ్రహించెను.
రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన ఆ దేవ దేవుడు మానవులను రక్షించుటకు వచ్చినపుడు, అవతరించినప్పుడు ఆయనకు కొద్దిపాటి స్థలంకూడ ఇవ్వలేదు ఈ పాడులోకం. కనీసం సత్రంలో కూడ ఆయన జన్మించడానికి చోటు దొరకలేదు. (లూకా 2:7) చివరకు తమ్మును రక్షించుటకు ఈ లోకానికి ఏతెంచిన యేసుక్రీస్తు జన్మించుటకు ఈ లోకం కేటాయించిన స్థలం ఏంటో తెలుసా? పశువులశాల, ఎంత దీనాతి దీనము? మనమీద ఆయనకున్న ప్రేమ తనను బలవంతము చేసెను కనుక ఎంతో దీనునిగా జన్మించెను. సర్వసృష్టికర్త సర్వోన్నతుడైన దేవుడు ఈ భూమిమీద సంచరించినప్పుడు “నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను చోటులేని” వానిగా మన కొరకై సంచరించెను. (మత్తయి 8:20)
ప్రియ చదువరీ!
దేవ దేవుడు ఈ లోకాన దిక్కుమాలిన వాడిగా ఎందుకు ఉదయించాల్సి వచ్చింది? నీ కోసమే! ఎందుకు ఆయన తన మహిమను విడిచి దరిద్రునిగా జన్మించింది? నీ కోసమే!
నీ కోసం తన్ను తాను రిక్తునిగా చేసుకొన్నాడు కాబట్టే...
ఆయన జన్మించింది... బదులు పుచ్చుకొన్న పశువులపాకలో
ఆయన బోధించింది... బదులపుచ్చుకొన్న పడవలో
ఆయన యెరుషలేమునకు వచ్చింది... బదులు పుచ్చుకొన్న గాడిదమీద
ఆయన చివరిసారిగా భోజనం చేసింది... బదులు పుచ్చుకొన్న మేడగదిలో
చివరిగా.....
ఆయన సమాధి చేయబడింది కూడా... బదులు పుచ్చుకొన్న సమాధిలోనే.
ఆయన పరలోక రాజైయుండి ఆ రాజ్యాన్ని విడిచి ఈ పాపలోకానికి దరిద్రునిగా వచ్చిన కారణం ఏమిటో తెలుసా? దరిద్రులమైన మనము ఈపాడు లోకాన్ని విడచి ఆయనతో మహిమ లోకానికి రావాలని! మరి ఇంతగా నీ కొరకు తన్నుతాను తగ్గించుకొని, దీనునిగా జన్మించిన ఆ యేసుకు నీ హృదయంలో చోటుందా? లేకపోతే ఈ రోజైన చోటిస్తావా?
Also Read: Christmas Parable 4 - బలహీనులను ఏర్పరచుకొనుట
Send Christmas Wishes With Your Name - Click Here

