Birth Of Jesus - Christmas Message In Telugu
పాపము లేని జననం
పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన ప్రియ కుమారున్ని ఈ లోకమునకు అందించుటకు పరిశుద్ధురాలు కావలసి వచ్చినది. అందుకు దేవునికి కన్యకయైనటువంటి మరియ ఆయనకు అందుబాటులో ఉన్నది. ఏ పాపము చేయకపోయినా గర్భము ధరించినప్పుడు అది దేవుని యొక్క చిత్తమని గ్రహించి ఎటువంటి అవమానమునైనా భరియించి మరియకు అండగా నిలిచే ఓ పరిశుద్ధుడు కావలసి వచ్చింది. అందుకు నీతిమంతుడైన యోసేపును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క నీతిమంతుల పరిశుద్ధమైన జీవితముల పుణ్యమే నీకు నాకు ఆ నాడు లోక రక్షకుడైన యేసయ్య దొరికాడు. ఈ దినాన ఎంతో మంది యేసుక్రీస్తు నామాన్ని ఎరుగక చీకటి నందు నశిస్తూ పోవుచూ ఉండగా వారికి నీతిమంతులైనటువంటి పరిశుద్ధులు దేవునికి కావాలి ప్రియులారా...
పరిశుద్ధముగా తమ యొక్క శరీరమును, జీవితమును కాపాడుకొనిదేవుని రాజ్య సువార్తను ప్రకటించు ప్రక్రియలో ఎన్ని నిందలు, అవమానములు, శ్రమలు వచ్చినను వాటిని మరియ మరియు యోసేపుల వలె మనం కూడా భరియించి, సహించి క్రీస్తు ప్రేమను అందించే యవనస్థులుగా మనం ఉండవలెను. మరి నీవు అందుకు సిద్ధముుగా ఉన్నవా..! లేకపోయినట్లైైతే నేడైనా యేసును సొంత రక్షకునిగా అంగీకరించి లోకమునకు రక్షకుని చూపించుటకు నిన్ను నీవే సమర్పించుకొనుము.
ప్రియ స్నేహితుడా...! నువ్వు ఒకవేళ దేవుని చిత్తమును చేయుచున్నప్పుడు ఆయన చేతిలో పనిముట్టుగా వాడబడుచున్నపుడు మరియ, యోసేపులు ఎదుర్కొన్న నిందలు, అవమానములు నువ్వు ఎదుర్కోనవలసి వస్తుంది. “నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకమని మనం పరిశుద్ధ గ్రంధమందు చూడగలం ప్రియులారా. అయితే... వాటన్నింటిలో నుంచి దేవుడు వారిని విడిపించు వాడై ఉన్నాడని ఎరుగుదుము (కీర్తనలు 34వ అధ్యాయము 19వ వచనము చదవండి) ఈ యొక్క వాగ్ధానమును గట్టిగా పట్టుకొని అల్ప కాల పాప భోగము అనుభవించటం కన్నా యేసుక్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంబని అని ఎంచుకున్నటువంటి మోషే లాగ మనలను మనము సమర్పించుకొనవలెను (హెబ్రీ పత్రిక 11: 26 వచనము చదవండి) నీకంటే ముందుగా దేవుని కొరకు పరిశుద్ధముగా జీవించిన వారు తిరస్కారములను, కొరడా దెబ్బలను, బంధకములను, జైలు శిక్షను అనుభవించారు. రాళ్ళతో కొట్టబడి, రంపములతో కోయబడి, శోధింపబడి చంపబడ్డారు (హెబ్రీ పత్రిక 11:36, 37 వచనములు చదవండి) అయినను ప్రాణము పోయిననూ చివరి శ్వాస వరకు క్రీస్తు కొరకు నమ్మకముగా జీవించి జీవ కిరీటమును పొందుకొనిరి. వారి బాటలో పయనిస్తున్న నీకు, నాకు ఈ శోధనలు, ఈ వేదనలు తప్పవు ప్రియమైన దేవుని బిడ్డ. అయినా క్రీస్తు కొరకే నిలబడుదాము. క్రీస్తును ఈ లోకానికి చూపెడదాము...
మనకున్న గొప్ప అవసరము...!
●మనకున్న గొప్ప అవసరము... చదువు అయినట్లయితే దేవుడు పండితున్ని పంపేవాడు
●మనకున్న గొప్ప అవసరము... డబ్బు అయినట్లయితే దేవుడు ధనవంతున్ని పంపేవాడు
●మనకున్న గొప్ప అవసరము... భవనములు అయినట్లయితే మనకు ఇంజనీర్ ను పంపేవాడు
●మనకున్న గొప్ప అవసరము... ఆరోగ్యము అయినట్లయితే మనకు డాక్టర్‌ను పంపేవాడు
●మనకున్న గొప్ప అవసరము... న్యాయము అయినట్లయితే జడ్జిని సంపేవాడు
●మనకున్న గొప్ప అవసరము....ఈ లోక సంబంధమైన రక్షణ అయితే పోలీస్ ఆఫీసరును పంపేవాడు
●మనకున్న గొప్ప అవసరము... పరిజ్ఞానము అయినట్లయితే దేవుడు సైంటిస్ట్ను
పంపేవాడు కానీ....
"మనకున్న గొప్ప అవసరము పాపక్షమాపణ కాబట్టి
దేవుడు తన ప్రియ కుమారుని పంపెను"
