Manna Bible Quizzes
జూన్ 05, 2021
బైబిల్ క్విజ్స్
బైబిల్ లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలను(బైబిల్) అధ్యయనం చేయుటకు, బైబిల్ ను ధ్యానించుటకు, బైబిల్ లోని విషయాలను లోతుగా అర్ధం చేసుకోవడానికి, అందులోని ఆత్మీయ సత్యాలను గుర్తించుకోవడానికి బైబిల్ క్విజ్స్ ఎంతగానో తోడ్పడుతాయి. మనమెరిగిన దేవుని నోటి మాటే; దేవుని వాక్యము..అదే బైబిల్. బైబిల్ నకు వేదాంత పండితులైన రాజారావు గారు దీనిని సాటిలేని సత్యవేదమని పిలిచారు. నేటి ఆధునిక క్రైస్తవ ప్రపంచంలో దైవ గ్రంధం పై లోతైన అవగాహన, పరిశీలన అవసరం.
క్రైస్తవుడు తానెరిగిన దేవుని గూర్చి పరిపూర్ణంగా ఎరుగుట తనకు మాత్రమే కాదు గాని; తాను నమ్మిన దేవునికి కూడా ఆనందదాయకము. కనుకనే పౌలు గారు నేను నమ్మిన వానిని నేనెరుగుదును అన్నారు (II తిమోతి 1:12) ఇదే దేవునికి ఆనందకరమైన విషయం(యిర్మీయా 9:24) అయితే తామెరిగిన దేవునిని లోతుగా తెలిసికొనుట కేవలం వాక్య పఠనం, ధ్యానము, అధ్యయనం ద్వారానే జరుగుతుంది. ఆయన వాక్యము దీపమై సరైన త్రోవను చూపించు వెలుగై యున్నదని కీర్తనకారుడు చెప్పారు. బైబిల్ ను అధ్యయనం చేయడం ఆయన గుణాతిశయములను తెలిసికొనుట మాత్రమే కాదు గాని; మన అవసరతలలో ఆయన వాగ్ధానాలలో దేనిని మనం ఎత్తి పెట్టి ప్రార్ధించవలెనో తెలుస్తుంది.
దేవునిని గూర్చి పరిపూర్ణంగా తెలుసుకోవాలన్న, దేవునిని ఆనందింపజేయాలన్న, దేవునికి సమీపంగా; దేవుని చిత్తమెరిగి ఆయనకు ఇష్టులుగా జీవించాలన్న క్రైస్తవునికి ఉన్న ఏకైక సాధనం దేవుని వాక్యము(వాక్య ధ్యానం, వాక్య పఠనం). దేవుని వాక్యాన్ని దీపముగా, తమ త్రోవను వెలుగుగా కలిగిన వారు ఆత్మలో, ఆత్మీయతలో లోతైన అనుభవములోనికి వెళుతారని, వాక్య పఠనం, ధ్యానం, పరిశీలన, అధ్యయనం ద్వారా ప్రభువునకు సమీపస్థులు కాగలరని మన్నా బైబిల్ క్విజ్స్ విశ్వసిస్తుంది.
ఆధునిక క్రైస్తవ ప్రపంచంలో అంటే ఆత్మీయ జీవితంలో మనలను సందేహాలలోనికి, అయ్యోమయంలోనికి, అనేకమైన అపోహలకు గురి చేస్తున్న ఈ రోజులలో బైబిల్ ను లోతుగా పరిశీలించి; అందులోని విషయాలను గుర్తించుకోవడానికి ఈ బైబిల్ క్విజ్స్ ఎంతగానో తోడ్పడుతాయని మన్నా బైబిల్ క్విజ్స్ ఆశిస్తుంది.
~Manna Bible Quizzes